సర్పంచుల గళం నొక్కే యత్నం
అశ్వాపురంలో 9 మంది బీఆర్‌ఎస్ సర్పంచుల ముందస్తు అరెస్టు
అశ్వాపురం,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సర్పంచుల పెండింగ్ బిల్లులను(Pending bills) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచులు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించిందని బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) ఆరోపించారు. ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు బయలుదేరుతున్న సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. అశ్వాపురం మండలానికి(Ashwapuram Mandal) చెందిన బీఆర్‌ఎస్ సర్పంచులు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే నిఘా పెట్టి, మొత్తం తొమ్మిది మంది సర్పంచులు, నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, పోలీసుల ద్వారా వారి గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టినా, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా అభివృద్ధిని అడ్డుకుంటూ, తమ హక్కుల కోసం ప్రశ్నించే ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అరెస్టులు, నిర్బంధాలతో సర్పంచుల ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సర్పంచులకు రావాల్సిన నిధులు, పెండింగ్ బిల్లులను విడుదల చేసి గ్రామపంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన సర్పంచుల పోరాటం ఆగదు.. గ్రామాల నుంచి హైదరాబాద్ వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డి, నెల్లిపాక సర్పంచ్ ముండ్రు రామకృష్ణ, ఆనందపురం సర్పంచ్ ముర్రం సమ్మయ్య, గొందిగూడెం సర్పంచ్ తాటి వెంకటలక్ష్మి, గొల్లగూడెం సర్పంచ్ కోండ్రు సమ్మయ్య, ఎలకలగూడెం సర్పంచ్ కలేటి నాగమణి, జగ్గారం సర్పంచ్ సున్నం తిరుపతమ్మ, చింతిర్యాల కాలనీ సర్పంచ్ కొరస అలివేలు ఉన్నారు.