కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఫిర్యాదు
సత్తుపల్లి. సెప్టెంబర్ 9. ( విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్ల శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సత్తుపల్లి బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ఆయన చావు కోరుకున్నారని ఆరోపిస్తూ సత్తుపల్లి బీఆర్ఎస్ నాయకులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే వీర్ల శంకర్‌పై ఫిర్యాదు చేశారు. వెంటనే శంకర్‌ను అరెస్ట్ చేసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ జోలికి వస్తే.. ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా సహించబోరని హెచ్చరించారు. ప్రశాంతమైన తెలంగాణలో ఇలాంటి విష సంస్కృతి మంచిది కాదని అన్నారు. రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఇలాంటి వ్యాఖ్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎల్లకాలం అధికారం మీది కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ.. ఈ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.