జిబూటి తీరంలో పడవ బోల్తా
- పిల్లలతో సహా 139 మంది వలసదారులు మృతి
- 84 మంది గల్లంతు.. బోటులో మొత్తం 305 మంది
- హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి యెమన్‌కు వెళ్తుండగా ఘటన
జెనీవా, అక్టోబర్ 11: తూర్పు ఆఫ్రికాలోని(East Africa) జిబూటి తీరంలో(Djibouti coast) 305 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పిల్లలతో సహా 139 మంది మృతిచెందారు. మరో 84 మంది గల్లంతయ్యారు. ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి అరేబియా ద్వీపకల్పంలోని యెమన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ మేరకు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ఆదివారం తెలిపింది. ఈ ప్రమాదకరమైన మార్గంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన పడవ ప్రమాదాలలో ఇది ఒకటి. ఈ మార్గంలో చాలా మంది వలసదారులు సంపన్న గల్ఫ్ దేశాలలో పని కోసం వెళ్తుంటారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం జిబూటి నుంచి యెమెన్‌కు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిందని ఐఓఎం పేర్కొంది. ఈ ప్రమాదంలో 139 మంది మృతి మరణించారు.
మృతులలో 82 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నారు. మరో 84 మంది గల్లంతవ్వగా, మరో 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరూ ఇథియోపియా జాతీయులేనని తెలిపింది. గల్లంతైన వారి కోసం ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగాయి.
ప్రతి సంవత్సరం హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి పదివేల మంది వలసదారులు భద్రత, ఆర్థిక అవకాశాల కోసం జిబూటి మీదుగా, బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తారని ఐఎంఓ తన ప్రకటనలో తెలిపింది. జలసంధికి అవతలి వైపున ఉన్న యెమెన్‌లో కొత్తగా పోరాటాలు తీవ్రమవుతున్నప్పటికీ రాకపోకలు కొనసాగుతున్నా యని వెల్లడించింది.
‘ఇది తీవ్రమైన ప్రాణనష్టమని జిబూటిలోని ఐఓఎమ చీఫ్ ఆఫ్ మిషన్ అలెగ్జాండర్ కోయిసాక్ పేర్కొన్నారు. మరో సురక్షిత మార్గం లేదని నమ్మితే తప్ప ఎవరూ అలాంటి పడవ ఎక్కరని ఐఓఎం డైరెక్టర్ జనరల్ అమీ పోప్ అన్నారు. గత సంవత్సరం ఈ మార్గంలో 900 మందికి పైగా వలసదారులు మరణించారు లేదా అదృశ్యమయ్యారని ఐఓఎం మిస్సింగ్ మైగ్రెంట్స్ ప్రాజెక్ట్ స్పష్టం చేసింది.