కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- ఢిల్లీలో మీకు ప్రజాస్వామ్య హక్కులు.. తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
- ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థపై రాహుల్ అబద్ధాల ప్రచారం
- దేశమంతా కాంగ్రెస్ నేతల విధ్వంస రాజకీయాలు
- ‘నిర్బంధ ప్రజాస్వామ్యం’ అని ఖర్గే అనడం సిగ్గుచేటు
- ఆయన ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిదని సూచన
అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటలకు.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం చేతలకు ఏ మాత్రం పొంతన లేకుండాపోయిందని, రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) విమర్శించారు. ‘రాజ్యాంగాన్ని కాపాడతామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, ప్రతిపక్షాల గొంతుకను గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పదేపదే చెప్తున్నది.
కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదు. ఢిల్లీలో, హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం’ అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
మేం పోరాడితే అడ్డుకోవడమేంటి?
గత మూడునాలుగు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల కారణంగా.. ప్రజలకు అసౌకర్యం కలిగినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా.. నిరసన తెలిపే అవకాశాన్ని అనేకసార్లు ఢిల్లీ పోలీసులు కల్పించారని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ప్రియాంక గాంధీ రోడ్డుపై పడుకున్నా, బారికేడ్లపైకి ఎక్కి జుగుప్సాకరంగా రాహుల్ వ్యవహరించినా..
వారి భావప్రకటన స్వేచ్ఛను పోలీసులు, అక్కడి ప్రభుత్వం గౌరవించాయి’ అని పేర్కొన్నారు. దేశమంతా రాహుల్ గాంధీ స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని.. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలపై ఆయన అబద్ధాలు ప్రచారం చేసినా రాజకీయంగా ఆయన మాట్లాడే హక్కును అడ్డుకోవాలని తమ ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నించలేదన్నారు.
రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ నాయకులు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారని, వారు నిరసనలు చేపట్టేందుకు శాంతిభద్రతలు అడ్డురావా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు ప్రజల సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఇక్కడి ప్రభుత్వానికి శాంతిభద్రతల సమస్యలన్నీ గుర్తుకొస్తాయా? ఇదెక్కడి నీతి? అని నిలదీశారు.
ఇదేం పద్ధతి?
‘ఢిల్లీలో కాంగ్రెస్‌కు కావాల్సిన ప్రజాస్వామ్య హక్కులు.. తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఉండకూడదు?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదని, బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు సహా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అనేకసార్లు గృహనిర్బంధం చేస్తూ.. గొంతు నొక్కే స్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఒకనీతి, ఢిల్లీలో మరోనీతి అన్నట్లు ద్వంద్వ నీతితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదన్నారు. ‘రాహుల్ గాం ధీ, ప్రియాంక వాద్రా... ఢిల్లీలో కోరుకుంటు న్న ప్రజాస్వామ్య స్వేచ్ఛనే తెలంగాణలో ప్రజ లు కోరుకుంటున్నారు’ అని తెలిపారు.
ఖర్గే..! హైదరాబాద్‌కు వచ్చి చూడండి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ‘ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ కాదు. మజిల్ డెమోక్రసీ (నిర్బంధ ప్రజాస్వామ్యం)’ అని సంబోధిస్తూ ట్వీట్ చేయడం ఏమిటని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికారాన్ని అందుకోలేక పోతున్నామన్న ఆవేదనతో, ప్రజలు ఆదరించడం లేదనే ఆక్రోషంతో మల్లికార్జున ఖర్గే ..
ఏకంగా ప్రజాస్వామ్యాన్నే నిందిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను అడ్డుపెట్టుకుని.. విధ్వంసకర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు పాల్పడుతున్నారు. వాళ్లు భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ప్రజా హక్కులను కాలరాసి, పత్రికా స్వేచ్ఛ హరించి, లక్షలాది ప్రజా నాయకులను నిర్బంధించిన పార్టీ కాంగ్రెస్. ఖర్గే ఓసారి హైదరాబాద్ కు వచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎలాంటి ప్రజాస్వామ్యం అమలవుతుందో చూసి చెప్పాలి.
సోనియా, రాహుల్, ప్రియాంకతో కలిసి ఖర్గే హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలపై నిలదీయడం తప్పు అని తెలంగాణ ప్రజానీకానికి చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రసంగాలు చేయడం కాదు.. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడమే అసలైన ప్రజాస్వామ్యం. ఢిల్లీలో మీరు కోరుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలోనూ ప్రతిపక్షాల విషయంలో అమలు చేసి చూపించాలి’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.