రెవెన్యూ ప్రక్షాళనకు గ్రీన్ సిగ్నల్!

12-10-2026 | 05:25am
  1. పెద్ద ఎత్తున తహసీల్దార్లు, ఆర్డీవోల బదిలీలు?
  2. రంగం సిద్ధం చేసిన సర్కార్!
  3. 22ఏ భూ వివాదాల నేపథ్యంలో నిర్ణయం
  4. జీవో 59 దరఖాస్తుల పరిష్కారానికి డెడ్‌లైన్
  5. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగియగానే బదిలీలు?

సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) రెవెన్యూ శాఖలో(Revenue Department) భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న 22ఏ వివాదాలు, క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో పాటు పలువురు తహసీల్దార్ల బదిలీలకు జీవో నంబర్ 630 రూపంలో సర్కార్ నాంది పలికింది. త్వరలోనే వివిధ జిల్లాల్లోని ఆర్డీవోలు, తహసీల్దార్ల భారీ బదిలీలకు రంగం సిద్ధమవుతున్నట్లు రెవెన్యూ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది.

22 ఏ రగడే అసలు కారణమా?

గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు సరిగ్గా క్షేత్ర పరిశీలన చేయకుండా నివేదికలు పంపడంతో లక్షలాది ఎకరాల ప్రైవేటు పట్టా భూములు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్ అనుమతులున్న ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి.

దీంతో సామాన్య ప్రజలు తమ భూములు అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్నారు. ఈ వివాదాల పరిష్కారంలో జాప్యం వహిస్తున్న అధికారుల వైఖరిపై సీరియస్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బదిలీల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అర్హత కలిగిన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు.

గతంలో ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులే ఇప్పటికీ కొనసాగుతుండటంతో, తమ తప్పులు బయటపడతాయన్న భయంతో ఫైళ్లను తొక్కిపెడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సామాన్యులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న అధికారుల తీరుపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. 

జీవో 59 దరఖాస్తులకు నెలరోజుల డెడ్ లైన్

రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కలెక్టర్లకు స్పష్టమైన గడువు విధించింది.

500 చదరపు గజాల లోపు ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లోగా పూర్తిగా స్క్రూటినీ చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అర్హులైన పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముందున్నవి పెద్ద మార్పులే

ఇప్పటికే జీవో 630 ద్వారా అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ప్రారంభం కాగా, రానున్న రోజుల్లో ప్రక్షాళన మరింత తీవ్రం కానుంది. భూ సర్వేలు, 22ఏ వివాదాల పరిష్కారంపై హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక రియల్ టైమ్ డ్యాష్ బోర్డు ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగనుంది. లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో భూ వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా అదనపు తహసీల్దార్లను సైతం నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ మొదటి వారంలో ముగియనుంది. నవంబర్ 9 తర్వాత ఎన్నికల నిబంధనల వెసులుబాటు లభించగానే రెవెన్యూ బదిలీల ఫైల్‌పై ప్రభుత్వం సంతకం చేసే అవకాశముంది. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు తమ సీట్లను కాపాడుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు