మేల్కోకపోతే ముప్పే
- ఎల్ నినోతో అడుగంటుతున్న జలవనరులు
- కేంద్రానికి నివేదికతోనే సరి.. ప్రత్యామ్నాయ చర్యలేవీ?
- నగరాలు, పట్టణాల్లో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్
- ముంచుకొస్తున్న తాగునీటి సంక్షోభం
- పొంచి ఉన్న నీటి యుద్ధాలు
- రానున్న ఎనిమిది నెలలకు గ్రామస్థాయి ప్రణాళిక తప్పనిసరి
అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఎల్ నినో కోరలు చాస్తున్నది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలతో పాటు బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ఈ సీజన్‌లో సాధారణం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు చెబుతున్నా.. వాస్తవానికి సుమారు 300 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం మాట దేవుడెరుగు..
తాగు నీటికి కూడా కటకట ఏర్పడే ప్రమాదం కనపడుతోంది. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ప్రజలకు, పశువులకు, ఇతర జంతువులకు తాగు నీటి కోసం ప్రణాళిక రూపొందించి, పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది. లేకపోతే తాగునీటి యుద్ధాలు, నీటి ట్యాంకర్ల వద్ద కొట్లాటలు తప్పేలా లేవు.
రిజర్వాయర్లు వెల వెల
రాష్ట్రంలోని అటు కృష్ణా, ఇటు గోదావరి నదుల పరిధిలో ఉన్న ప్రధాన రిజర్వాయర్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి వర్షాలు కురవక, నదుల్లోకి వరద రాక.. రిజర్వాయర్లన్నీ వెలవెలబోతున్నాయి. గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో ఈ నెల 10 నాటికి 63.5 టీఎంసీల నీటి వనరులు అందుబాటులో ఉండగా.. ఇందులో 44 టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది.
నిజానికి గతేడాది ఇదే సమయానికి గోదావరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో 124.4 టీఎంసీల నీళ్లు ఉండగా.. అందులో 95.9 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే గతేడాది ఉన్న జలాల్లో సగంకూడా అందుబాటులో లేవని అర్థమవుతోంది. అలాగే కృష్ణా నది బేసిన్ పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో ప్రస్తుతం 297.7 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ..
ఇందులో కేవలం 119 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. అదే గతేడాది ఇదే సమయానికి 580 టీఎంసీలు ఉండగా.. అందులో 402 టీఎంసీలు వినియోగానికి అనుకూలంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లన్నీ మొత్తంగా చూసుకుంటే.. శనివారం నాటికి 361.3 టీఎంసీలు ఉండగా.. ఇందులో కేవలం 163.9 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవచ్చు.
గతేడాది ఇదే సమయానికి 704.5 టీఎంసీలు ఉండగా.. అందులో 498.2 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే గతేడాదితో పోల్చితే 32.89 శాతం మాత్రమే ఇప్పుడు జల వనరులు అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది.
చెరువులు.. బోర్లు సైతం
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,000 చెరువులు ఉన్నాయి. వీటి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 253.8 టీఎంసీలు. కానీ ఈ నెల 4వ తేదీ నాటికి కేవలం 96 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలు మరింత ముదిరే అవకాశం కనపడుతోంది.
నీరు కూడా ఆవిరి అయ్యే శాతం గణనీయంగా పెరుగుతోంది. త్వరలోనే చెరువుల్లోని నీరంతా ఇంకిపోయే అవకాశం ఉంది. బోర్లు కూడా ఆగి పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు సాధారణంకంటే 1.57 మీటర్లు దిగువకు పడపోయాయి. సగటున 7.77 మీటర్ల దిగువను భూగర్భ జలాలు ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ సమాచారం.
ట్యాంకర్లకు డిమాండ్
హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లో నీటి ట్యాంకర్ల సందడి పెరిగిపోయింది. బోర్లు ఎండిపోవడంతో లక్షలాది మందికి నీటి ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. త్వరలో ఈ పరిస్థితి గ్రామాల్లో కూడా ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పటికే ట్యాంకర్ నీళ్ల కోసం గొడవలు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు అవసరమైన నీటి అవసరాలు తీర్చేందుకు ఉస్మాన్‌సాగర్, హిమా యత్‌సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, యెల్లంపల్లి తదితర రిజర్వాయర్ల నుంచి సరఫరా అవుతోంది. ఈనెల 10వ తేదీ నాటికి 9.783 టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయానికి 25.971 టీఎంసీల నీరు అందుబాటులో ఉండటం గమనార్హం. సిటీలో బోర్లన్నీ నోరు తెరవడంతో.. ట్యాంకర్ల సంఖ్య పెరుగుతోంది.
సీఎం పర్యవేక్షణ తప్పనిసరి
ఇప్పటికే ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈనెల 12న మంత్రులతోనూ ఎల్ నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించనున్నా రు. అయితే వచ్చే వర్షాకాలం వరకు ఎదురయ్యే ఇబ్బందులపై సీఎం ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. అవసరమైతే అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి, వారి ఆలోచనలు, అభిప్రాయాలను స్వీకరించవచ్చు.
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొ నేందుకు ఇప్పటికే రూ.20 వేల కోట్లు కావాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించింది. అయితే అది చేతులు దులుపుకునే చర్యగా మిగలవద్దు. కేంద్రం నుంచి సాయం అందుతుందా.. లేదా అనేది పక్కనపెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి వారం, పక్షం రోజులకు ఒకసారి సీఎం నేరుగా పరిస్థితిని సమీక్షించాలి.
గ్రామ స్థాయిలో ప్రణా ళికకు అవసరమైన నిధులనుకూడా కేటాయించాలి. లోటుపాట్లను, ప్రజల ఇబ్బం దులను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలి. ఇలా చేస్తేనే ప్రజల్లో ప్రభుత్వంపట్ల నమ్మకం కలుగుతుంది. ఎల్‌నినో ప్రభా వం నుంచి ప్రజలు, రాష్ట్రం బయటపడుతుంది. లేకపోతే.. తాగునీటి యుద్ధాలు మొదలవుతాయి. శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. అది అంతిమంగా సర్కారు మెడకు చుట్టుకుంటుంది.
రాబోయే 8 నెలలకు.. ప్రత్యామాయం
ఎల్ నినో ప్రభావం వచ్చే సంవత్సరం వర్షాకాలం వరకు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న 8 నెలల పాటు ఏం చేయాలనేది ఇప్పుడు సర్కారు ముందు ఉన్న ప్రశ్న. ఇందుకు కచ్చితంగా ప్రత్యామ్నాయం అవసరం. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి నీటిని సరఫరా చేయాల్సిం దే. అవసరం అయితే కర్నాటక రాష్ట్రంతో సంప్రదింపులు మొదలుపెట్టాలి.
కర్నాట క రాష్ట్రంలోని రిజర్వాయర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లో సుమారు 80 నుంచి 90 శాతం వరకు నీటి వనరులున్నాయి. కనుక అక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే.. కనీసం తాగునీటి కోసమైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలి. ఏపీలో రిజర్వాయర్లన్నీ 75 శాతానికంటే ఎక్కువగానే నిండి ఉన్నా యి.
ఎల్లంపల్లి నుంచే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కొన్ని పంప్‌హౌజ్‌లను ఉపయోగించుకోవాలి. దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. సీతారామ లాంటి ప్రాజెక్టుల నుంచికూడా నీటిని పంప్ చేయవచ్చు. గోదావరి బేసిన్‌లో దిగువ ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎలా వాడుకోవచ్చో మార్గాలు అన్వేషించాలి.
మున్సిపల్, నీటిపారుదల, పంచా యతీ రాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, ఆర్థిక శాఖలతో హైలెవల్ కమిటీ ఏర్పాటుచేసి యుద్ధప్రాతిపదికన పక్కా ప్రణాళికలు తయారు చేసి పకడ్బందీగా అమలు చేయాలి.