ప్రభుత్వ సెలవు రోజు వస్తే ఆర్టీసీ బస్సు బంద్!

12-10-2026 | 05:20am
  1. హన్మకొండ ఆర్డినరీ సర్వీసు నిలిపివేతపై ప్రయాణీకుల ఆగ్రహం
  2. పగటిపూట రవాణా సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలే దిక్కు

గుండాల, అక్టోబర్ 11 (విజయక్రాంతి): మండల కేంద్రానికి(Mandal headquarters) హన్మకొండ నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య వచ్చే పరకాల ఆర్డినరీ బస్సు సర్వీసు తీరుపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు దినం వచ్చిందంటే ఈ బస్సు సర్వీసును నిలిపివేస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

మండల కేంద్రం నుంచి పస్రా, మేడారం, హన్మకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు పగటిపూట ప్రయాణించాలంటే సరైన బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ నుంచి వచ్చే రాత్రి సర్వీసు మినహా పగటిపూట రాకపోకలకు తగిన రవాణా సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పనులపై వెళ్లేవారు,

ఇతర ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతు న్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లోనూ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులను నడపాలని కోరుతున్నారు.

ఈ సర్వీస్ ను దసరా సెలవులకు ఒక రోజు ముందే నిలిపివేయడంతో పండుగకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి హన్మకొండ ఆర్డినరీ బస్సు సర్వీసును ప్రతిరోజూ కొనసాగించడంతోపాటు, పగటిపూట అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.

ప్రతి రోజు రెగ్యులర్ గా హన్మకొండ బస్సును నడిపించాలి. సెలవు రోజులలో బస్సు నడవకపోవడంతో మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము.

 నవీన్ గుండాల

ఈ బస్సు సర్వీస్ ను ప్రభుత్వ టీచర్స్, విద్యార్థుల కోసం నడిపిస్తున్నారు. అందుకే సెలవు రోజులలో పూర్తిగా బస్ ను రద్దు చేస్తున్నారు. మాలాంటి ప్రయాణీకులతో ఆర్టీసీకి ఆదాయం రాదా

 శ్రీధర్ స్వామి

మరిన్ని వార్తలు