సిద్దిపేట నుంచే మళ్లీ ఉద్యమం
- కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి
- ప్రాజెక్టులు పూర్తి చేయలేని ప్రభుత్వంతో రైతులకు కష్టాలు: హరీశ్‌రావు
సిద్దిపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి, కొత్త జిల్లాల ఏర్పాటు పోరాటానికి వేదికగా నిలిచిన సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS government) అధికారంలోకి రావడానికి ఉద్యమం ప్రారంభమవుతుందని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) అన్నారు.
సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. 1983లో ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని దరఖాస్తు అందించిన ఉద్యమ చరిత్ర ఉందని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ అదే ఆకాంక్షను నెరవేర్చి 2016 అక్టోబర్ 11న జిల్లాను ఏర్పాటు చేశారని హరీశ్ తెలిపారు.
కాంగ్రెస్‌తో కృత్రిమ కరువు
రాష్ట్రంలో జల వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రాజెక్టుల మోటార్లను పూర్తిస్థాయిలో నడపకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు.
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఏర్పడిన కృత్రిమ కరువని వ్యాఖ్యానించారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పనుల రద్దుపై ఆగ్రహం
సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వం ప్రారంభించిన పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. వెటర్నరీ కళాశాల భవనం, ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, స్పోర్ట్స్ స్టేడియం, రంగనాయక సాగర్ పర్యాటక ప్రాజెక్టు, కోమటి చెరువు శిల్పారామం, వ్యవసాయ కళాశాల వంటి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు.
హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్టు, దుబ్బాక ప్రాంతంలోని ఇరుకోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. సిద్దిపేటకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
సిద్దిపేటలో 95 శాతం నిర్మాణం పూర్తయిన వెయ్యి పడకల ఆసుపత్రి మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దుద్దెడలో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 20 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు జరిగాయని పేర్కొన్నారు.
రుణమాఫీపై రైతులకు అన్యాయం
రైతు రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22 వేల మందికి రుణమాఫీ జరిగితే, మరో 24 వేల మంది రైతులకు ప్రయోజనం అందలేదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.