రిపేర్లకు కొత్త ప్లాన్
- కాళేశ్వరం వ్యయ భారం భరించేందుకు నిర్మాణ సంస్థల వెనుకడుగు
- తొలుత సొంత నిధులతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన.. ఆపై నిర్మాణ సంస్థల నుంచి రికవరీ
- మూడు బరాజ్‌లకు రూ.1,500 కోట్లు అంచనా
- మేడిగడ్డ కుంగుబాటుకు ఈ నెల 21తో మూడేళ్లు
- నేటికీ మొదలుకాని పునరుద్ధరణ పనులు
- జాప్యానికి తెరదించేందుకే ప్రత్యామ్నాయ మార్గాలు
అక్టోబర్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణకు(Kaleshwaram Barrage Repairs) రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణ పనుల్లో జాప్యానికి తెరదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బరాజ్‌ల మరమ్మతుల వ్యయాన్ని ముందుగా భరించేందుకు నిర్మాణ సంస్థలు వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగే ఆలోచనలో ఉంది.
తొలుత ప్రభుత్వమే నిధులు వెచ్చించి, ఆ తర్వాత సంస్థల నుంచి రికవరీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే నిధుల సమీకరణకు నెలకొన్న అడ్డంకులను అధిగమించి పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాక్ కుంగుబాటు ఘటనకు ఈ నెల 21 నాటికి మూడేళ్లు పూర్తి కానున్నాయి. పునరుద్ధరణపై అనేక సార్లు చర్చలు జరిగినప్పటికీ, పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
ఈ నేపథ్యంలో బరాజ్‌ల పునరుద్ధరణ ఎప్పుడు? తిరిగి వినియోగంలోకి తెచ్చేదెప్పుడు? అనే ప్రశ్నలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మేడిగడ్డ బరాజ్‌లో 7వ బ్లాక్ కుంగుబాటు కీలక పరిణామంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి నిర్మాణ నాణ్యత, బరాజ్ పునాది పరిస్థితులు, నిర్మాణంలో అనుసరించిన విధానాలు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ స్థాయిల్లో పరిశీలనలు జరిగాయి.
మరోవైపు బరాజ్‌ని పునరుద్ధరణకు అనుసరించాల్సిన సాంకేతిక విధానంపై స్పష్టత అవసరమైంది. పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాజెక్టు వినియోగం, నీటి నిర్వహణ, భవిష్యత్తులో చేపట్టాల్సిన మరమ్మతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం పెరుగుతోంది.
పునర్నిర్మాణమా? నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్‌గా మార్పా?
మూడేళ్లు పూర్తి కావొస్తున్నా పునరుద్ధరణ పనులకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. మేడిగడ్డ బరాజ్‌లో దెబ్బతిన్న 7వ బ్లాక్‌ను పూర్తిగా తొలగించి తిరిగి నిర్మించాలా? లేక ప్రస్తుత నిర్మాణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్‌గా మార్చాలా? అనే అంశాలపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ రెండు ప్రతిపాదనల్లో ఏ విధానాన్ని ఎంచుకోవాలన్నది పునరుద్ధరణ పనుల స్వరూపం, వ్యయం, కాలపరిమితిని నిర్ణయించనుంది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి తిరిగి నిర్మించాల్సి వస్తే అదనపు నిర్మాణ పనులు, వాటికి సంబంధించిన వ్యయం, పనులు పూర్తిచేయడానికి పట్టే సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు, నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్‌గా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తే దాని సాంకేతిక సాధ్యాసాధ్యాలు, నిర్మాణ స్థిరత్వం, నీటి ప్రవాహ నిర్వహణ, భవిష్యత్తులో బ్యారేజీ పనితీరుపై ప్రభావం వంటి అంశాలను నిపుణులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సాంకేతిక నివేదికలు, నిపుణుల సూచనలు, నిర్మాణ పరిస్థితుల సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
నిధుల సమీకరణే కీలకం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు సుమారు రూ. 1,500 కోట్ల వ్యయం అవుతుందని ప్రభు త్వం అంచనా వేసింది. పునరుద్ధరణకు అవసరమయ్యే నిధులను సమకూర్చడం ప్రభుత్వానికి కీలకంగా మారింది. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో ఆర్థిక బాధ్యతను నిర్మాణ సంస్థల పై ఉంచాలా?
లేక ప్రభుత్వమే ముందుగా నిధులు వెచ్చించి పనులను చేపట్టాలా? అనే అంశంపై ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోం ది. మూడు బరాజ్‌ల పరిస్థితులు, వాటికి చేపట్టాల్సిన మరమ్మతులు, అవసరమైన నిర్మాణ మార్పులు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఒక్కో బరాజ్‌కి చేపట్టాల్సిన పనుల స్వరూపం, వాటికి అయ్యే వ్యయం, పనులు పూర్తయ్యే గడువును స్పష్టంగా నిర్ధారించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా మేడిగడ్డ 7వ బ్లాక్ విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పునరుద్ధరణ పనుల అంచనాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ముందుగా నిధులు సమకూర్చే ప్రతిపాదనను అమలు చేస్తే, నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో పనుల నాణ్యత, నిర్మా ణ భద్రత, వ్యయ నియంత్రణ, పనుల పర్యవేక్షణకు తగిన ఏర్పాట్లు చేయడం అవసరం కానుంది. పునరుద్ధరణ పనుల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని నిర్మాణ సంస్థల నుంచి తిరిగి రాబట్టాలంటే ఒప్పం ద నిబంధనలు, బాధ్యతల నిర్ధారణ, సంబంధిత చట్టపరమైన అంశాలపై స్పష్టత ఉండాలి.
కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రస్తు తం పనుల కోసం అవసరమైన నిధుల సమీకరణ, మేడిగడ్డ ఏడో బ్లాక్‌పై సాంకేతిక నిర్ణయం, నిర్మాణ సంస్థల బాధ్యతలు, వ్యయ రికవరీ విధానం వంటి మూడు అంశాలపై స్పష్టత వస్తేనే పునరుద్ధరణ పనులకు సంబంధించి సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు వీలవుతుంది. ప్రభుత్వమే ముందుగా ఖర్చు భరించి పనులు చేపట్టాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటే ఆర్థిక కారణాలతో ఎదురవుతున్న జాప్యాన్ని కొంతవరకు అధిగమించే అవకాశం ఉంటుంది.
మొత్తంగా మేడిగడ్డ కుంగుబాటు ఘటనకు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పునరుద్ధరణ పనులకు ఎప్పుడు శ్రీకారం చుడుతుంది? అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే పనుల ప్రారంభం, నిధుల కేటాయింపు, వ్యయ రికవరీపై స్పష్టత రానుంది.