చివరి మజిలీలోనూ చింతేనా..!
- శ్మశానవాటికలు ఇలా.. దహన సంస్కారాలెలా?
- కనీస సౌకర్యాలు లేక తప్పని కష్టాలు పట్టించుకోని అధికారులు
పాలకీడు, అక్టోబర్ 11: ప్రజల జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ప్రభుత్వ సేవలు(Government Services) అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే మనిషి జీవితానికి చివరి మజిలీ అయిన స్మశాన వాటికల నిర్వహణ మాత్రం పట్టించుకునే నాథుడే లేని ప రిస్థితి నెలకొంది.
లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్మశాన వాటికలు ప్రస్తుతం నిరుపయోగ మొక్కలు, కంప చెట్ల తో నిండిపోయి అధ్వానంగా మారాయి. కనీ స పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడంతో మృ తదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇ బ్బందులు పడాల్సి వస్తోంది.
అడుగు పెట్టాలంటేనే అతికష్టం
మండల కేంద్రంలోని స్మశాన వాటిక పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడు తోంది. స్మశాన వాటికకు పెద్ద ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసినప్పటికీ దాని లోపలికి వెళ్లే దారి మొత్తం నిరుపయోగ మొక్కలు, కంప చెట్లతో అల్లుకపోయింది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన చెట్లు, పొదలు దర్శనమిస్తున్నాయి. అంతిమ సంస్కారాలకు వెళ్లేవారు జాగ్రత్తగా అతి కష్టంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం కావడంతో మొక్కలు మరింత పెరిగి ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా మారింది.
చివరి మజిలీలోనూ తీరని చింత..!
కుటుంబసభ్యుల్లో ఎవరైనా మృతి చెందితే అంతిమ సంస్కారాల కోసం స్మశాన వాటికకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం మరింత ఇబ్బందిక రంగా మారుతోంది. మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు సరైన దారి లేకపోవడం, కూర్చు నేందుకు వసతులు లేకపోవడం, ఎండ, వా న నుంచి రక్షణకు సరైన షెడ్లు లేకపోవడం వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.
పారిశుద్ధ్యంపై కరువైన శ్రద్ధ?
స్మశాన వాటికలను నిర్మించడంతోనే అధికారులు తమ బాధ్యత పూర్తయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణాలు చేపట్టిన తర్వాత వాటి నిర్వహణ, పరిశుభ్రత, పరిసరాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలుక నిపించడం లేదు. నెలల తరబడి పిచ్చి మొక్కలు తొలగించక పోవడంతో అవి ఏపుగా పెరిగి ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నాయి. దీంతో స్మశాన వాటికలు ఉన్నాయా..? లేవా..? అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
కరువైన వసతులు
స్మశాన వాటికల్లో దహన సంస్కారాలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. నీటి సదుపాయం, విద్యుత్, దహన వాటిక, కూర్చునే స్థలం, షెడ్లు, ప్రహరీ, అంతర్గత రహదారి, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సౌకర్యాలు ఉండాలి. అయితే అనేక ప్రాంతాల్లో వీటిలో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. ఉన్న సౌకర్యాలకు కూడా నిర్వహణ లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండ ల వ్యాప్తంగా ఉన్న స్మశాన వాటికలను పరిశీలించి అక్కడ ఇబ్బందికరంగా ఉన్న కంప చెట్లను తొలగించడంతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పించి చివరి మజిలీకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కంపచెట్లు అల్లుకపోయాయి
పాలకవీడులో ఉన్న స్మశానవాటిక లోప ల మొత్తం కంపచెట్లతో నిండిపోయినది. అందులోకి వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా మారింది. కరెంట్ లేదు నీళ్ల సౌకర్యం లేదు, అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు కల్పించాలి.
- మాతంగి ఏసురత్నం, పాలకీడు