11 వందల ఏళ్ల గజలక్ష్మి శిల్పం
- రాష్ట్రకూటుల కాలపు నాటిది
- మెదక్ జిల్లా యనగండ్ల గ్రామంలో గుర్తించిన చరిత్రకారులు శివనాగిరెడ్డి, హరగోపాల్
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలోని(Yanagandla Village) రాష్ట్రకూటుల కాలపు (సా.శ. 9వ శతాబ్ది) అరుదైన గజలక్ష్మి శిల్పాన్ని(Gajalakshmi sculpture) కాపాడుకోవాలని చరిత్రకారులు(Historians) గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
మెదక్ పట్టణంలో లైబ్రేరియన్‌గా పని చేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్రా సంతోష్ ఇచ్చిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షులు శ్రీరామోజు హరగోపాల్.. యనగండ్ల ఆంజనేయస్వామి దగ్గర రావి చెట్టు కింద నిర్లక్ష్యంగా పడి ఉన్న నల్ల శాసనపు రాతిలో చెక్కిన అరుదైన గజలక్ష్మి శిల్పాన్ని పరిశీలించారు.
ఒక శిలాతోరణం పైన అలంకరణగా ఉంచిన ఈ శిల్పంలో పద్మాసనం కూర్చున్న గజలక్ష్మి, రెండు చేతుల్లో పద్మాలను, వంటిపై ఆభరణాలను, తలపై కిరీటాన్ని ధరించిందని, అటూ ఇటూ అత్యంత సుందరంగా రెండు ఏనుగులు, నీటి కలశాలతో గజలక్ష్మికి అభిషేకం చేస్తున్నట్లు, పైన గల చక్కటి మకర తోరణం మధ్యలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని అమృత మధన దృశ్యం,
పైన అమృత కలశం ఉన్నాయని వారన్నారు. గజలక్ష్మి శిల్పంపై అమృత మధన దృశ్యం ఈ శిల్పం ప్రత్యేకతని, ఈ శిల్పానికి వెనక వైపున ఆనందతాండవంలో ఉన్న నటరాజ, అటు ఇటు బ్రహ్మ, విష్ణుమూర్తి అంజలి ముద్రలో ఉండి, త్రిమూర్తులలో శివుడి ఆధిక్యతను అంగీకరిస్తున్నట్లు మలచబడిందని,
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని అమృత మధన దృశ్యం ఉన్న, ఈ గజలక్ష్మి -నటరాజ శిల్పాన్ని ఒక పీఠంపై నిలబెట్టి, భద్రపరిచి, భావితరాలకు అందించాలన్న శివనాగిరెడ్డి, హరగోపాల్ విజ్ఞప్తికి గ్రామస్తులు అనుకూలంగా స్పందించారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, కూరబోయిన సిద్ధరాములు, ప్రదీప్, నరేష్, లోకేష్, రంగప్పగారి నాగిరెడ్డి పాల్గొన్నారు.