వాచ్యా తండా లిఫ్ట్ పునఃప్రారంభం
సాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
దామరచర్ల : మిర్యాలగూడ ఎమ్మెల్యే సొంత ఖర్చుతో గిరిజనులకు చెందిన ఐదు వందల ఎకరాల భూమికి సాగు నీటిని అందిస్తుండడం పట్ల సర్వత్రా హర్షితిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దామరచర్ల మండలం(Damaracharla Mandal) వాచ్యా తండా పరిధిలోని లిఫ్ట్‌కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కొన్ని నెలల క్రితం చోరీకి గురికావడంతో లిఫ్ట్ మూత పడింది. దీంతో సుమారు 500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Bathula Lakshma Reddy) దృష్టికి రావడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించారు.
ప్రస్తుతం పంటలకు అత్యవసరంగా మూడు నెలల పాటు సాగునీరు అవసరం ఎంతో ఉంది. రైతుల(Farmers) ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నీటిని అందించేందుకు ఎమ్మెల్యే నెలకు రూ లక్ష చొప్పున సొంతంగా అద్దె చెల్లిస్తూ తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి, వారి తనయులు బత్తుల ఈశ్వర్, గణేష్ లు సోమవారం పూజలు చేసి ట్రాన్స్ఫార్మర్ ను ఆన్ చేసి లిఫ్ట్ ప్రారంభించారు. తాత్కాలిక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంతో లిఫ్ట్‌ను వెంటనే పునఃప్రారంభించి, లిఫ్ట్ పరిధిలోని సుమారు500 ఎకరాల పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు.
దీంతో పంటలు చేతికందే పరిస్థితి ఏర్పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటి సమస్యను పరిష్కరించడం లో అధికారులతో సమన్వయం చేస్తూ నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించడంతో పాటు, తాత్కాలికంగా తన సొంత ఖర్చుతో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ చొరవను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావూరి సుజాత రవినాయక్ , సర్పంచ్‌లు సైదా నాయక్, మంగత్తా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్, కాంగ్రెస్ నాయకులు రవితేజ, గాజుల శ్రీను, గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.