చిన్న కాళేశ్వరం కాలువలకు రీ సర్వే చేపట్టాలి
21-09-2026 | 07:47pm
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సంబంధించి రీ సర్వే నిర్వహించి, 2013 భూసేకరణ చట్టం(Land Acquisition Act 2013) ప్రకారం బహిరంగ మార్కెట్ విలువకు నాలుగు రెట్ల పరిహారంతో పాటు 100 శాతం సోలాటియం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం(Telangana Farmers Association) జిల్లా సహాయ కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో రైతులతో కలిసి కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. కాలువల కోసం సేకరించిన భూమి వల్ల వ్యవసాయానికి పనికిరాకుండా మిగిలిన భూమికి కూడా పరిహారం చెల్లించాలని కోరారు. గతంలో అభ్యంతరాలు తెలిపినా పరిష్కారం కాలేదని, రీ సర్వే పూర్తయ్యే వరకు అవార్డు విచారణ నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.