లబ్ధిదారులకు సంక్షేమ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
- మనూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నారాయణఖేడ్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): బడుగు బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) అన్నారు. సోమవారం మనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు వివిధ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి త్వరలో కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.