కల్వకుర్తిలో ‘సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ’
* నిరుద్యోగ యువతకు ఉచితంగా ఆధునిక సాంకేతిక శిక్షణ
* డిసెంబర్ 1 నుంచి ఏఐ, పైథాన్, జావా తదితర కోర్సులు
కల్వకుర్తి నవంబర్ 24: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో ‘సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ(Sunki Reddy Skill Factory)’ ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 1 నుంచి కల్వకుర్తి ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా పాత కృష్ణవేణి జూనియర్ కళాశాల భవనంలో శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా ఫుల్‌స్టాక్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, జీఎస్టీ, టాలీ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ ప్రాక్టికల్ శిక్షణతో పాటు రెజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ఉద్యోగ మార్గదర్శకత్వం చేస్తున్నట్లు తెలిపారు. 2022 నుంచి నిరుద్యోగ యువత కోసం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఉచిత పోలీస్ ఉద్యోగ కోచింగ్ ద్వారా 22 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని, 2026లో ఆరు మండలాల్లో 300 మందికి పైగా పోటీ పరీక్షల శిక్షణ అందించినట్లు రాఘవేందర్ రెడ్డి వివరించారు. గ్రామీణ యువత హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండానే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకునేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శేఖర్, గణేష్, శ్రీపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.