గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం

11-11-2026 | 06:53pm

21,800 లీటర్ల బెల్లం ముక్క పానకం ధ్వంసం, 102 లీటర్ల గుడుంబా స్వాధీనం.

వెంకటాపురం/నూగూరు నవంబర్ 11 (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరునాగారం ఏఎస్పి పర్యవేక్షణలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు మంగళవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు.

ఆలుబాక గ్రామపంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన 25 డ్రమ్ముల్లో సుమారు 5,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. బోదాపురం గ్రామపంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామ శివారులో 52 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన  10,800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.

బోదాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన 28 డ్రమ్ముల్లో సుమారు 6,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 32 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. నిర్వహించిన దాడుల్లో మొత్తం 105 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 21,800 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 102 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీలో పాల్గొన్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం తయారీ, నిల్వ, విక్రయాలు రవాణాకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడుల్లో వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్  ముత్యం రమేష్, ఎస్‌ఐలు కె. తిరుపతిరావు, తిరుపతిరెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆలుబాక సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు