పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ చేయూత

11-11-2026 | 06:57pm

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు, (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక ఇబ్బందులకు కారణం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా వారి కష్టాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

బూర్గంపాడు మార్కెట్‌ యార్డులో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహ సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా సాయం అందిస్తోందన్నారు. పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా, వివాహ వేడుకలను సంతోషంగా నిర్వహించుకునేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసాద్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పి.సుధాకర్‌రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు