లంబాడిపల్లెలో ఓటర్లకు సర్ నోటీసుల కలకలం!
- 440 మంది ఓటర్లకు 400 మందికి పైగా నోటీసులు..
- ఓటు హక్కుపై తీవ్ర ఆందోళన
చెన్నూర్, సెప్టెంబర్ 29: మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ మండలంలోని లంబాడిపల్లె గ్రామంలో సర్ నోటీసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో మొత్తం సుమారు 440 మంది ఓటర్లు ఉండగా, వారిలో 400 మందికి పైగా ఓటర్లకు సర్ నోటీసులు అందినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లకు నోటీసులు రావడంపై గ్రామస్థుల్లో తీవ్ర అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2002లో లంబాడిపల్లె గ్రామం కిష్టంపేట ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సమయంలోనే పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. అనంతరం 2019 పంచాయతీరాజ్ ఎన్నికల సమయంలో లంబాడిపల్లె ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటికీ, గ్రామంలోని ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని పేర్కొంటున్నారు.
అయితే ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా లంబాడిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని 400 మందికి పైగా ఓటర్లకు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రాతిపదికన ఇంత భారీ సంఖ్యలో నోటీసులు జారీ చేశారో స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న తమకు ఇప్పుడు నోటీసులు ఎందుకు వచ్చాయో అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, నోటీసుల వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఓటు హక్కు విషయంలో తమకు అన్యాయం జరగకుండా తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లంబాడిపల్లె ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.