మెరుగైన విద్యుత్ అందించేందుకు కృషి

09-10-2026 | 10:21pm
  1. కెపాసిటర్ బ్యాంకులతో విద్యుత్ నష్టాల తగ్గింపు
  2. అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
  3. టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వెల్లడి

ములుగు, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : విద్యుత్ సరఫరా(Power supply) నాణ్యతను మెరుగుపరచడంతో పాటు వోల్టేజ్ స్థాయిలను నియంత్రించేందుకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో 2 ఎంవీఏఆర్, 1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులతో పాటు 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు సర్కిల్(Mulugu Circle) సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి(Bikshapathi) తెలిపారు. ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో  2 ఎంవీఏఆర్ 21, 1 ఎంవీఏఆర్, 21 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

ఫీడర్ల పై ఇండక్టివ్ లోడ్ అధికంగా ఉండటం వల్ల పవర్ ఫ్యాక్టర్ తగ్గే అవకాశం ఉంటుందని, కెపాసిటర్ బ్యాంకుల(Capacitor banks) ఏర్పాటు ద్వారా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపడటంతో పాటు విద్యుత్ ప్రవాహంలో నష్టాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ఎస్‌ఈ తెలిపారు. కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుతో స్థిరమైన వోల్టేజ్‌తో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు సాంకేతిక విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

కెపాసిటర్ బ్యాంకుల ద్వారా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లపై పడే భారం తగ్గి, వాటి సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న లోడ్‌కు అనుగుణంగా వెంటనే అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చని ఎస్‌ఈ తెలిపారు. ఫీడర్ చివరి ప్రాంతాల్లో వోల్టేజ్ ప్రొఫైల్ మెరుగుపడటంతో వినియోగదారులకు మరింత స్థిరమైన వోల్టేజ్ అందుతుందని వివరించారు. విద్యుత్ పరికరాల పనితీరు మెరుగుపడటంతో పాటు సరఫరా నాణ్యత కూడా పెరుగుతుందని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఈ తెలిపారు.

మరిన్ని వార్తలు