నేటి ఆవిష్కరణలే.. రేపటి భవిష్యత్తు...
- పల్లెల్లో ప్రతిభను వెలికితీయాలి
- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, అక్టోబర్ 29 (విజయక్రాంతి): పల్లెల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, స్థానిక సమస్యలకు పరిష్కారం చూపే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్(District Collector Borkhade Hemant) సహదేవరావు అన్నారు. గురువారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి ఆవిష్కరణలే రేపటి భవిష్యత్తుకు పునాదులని అన్నారు. గ్రామీణ ప్రజలు తమ అనుభవాల ఆధారంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కనుగొనే పరిష్కారాలను గుర్తించి, వాటిని మరింత మందికి ఉపయోగపడేలా ప్రోత్సహించాలని సూచించారు.
రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత, చేతివృత్తిదారుల్లోని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఆవిష్కరణలు పెద్ద పరిశోధనా కేంద్రాలకే పరిమితం కావని, ప్రతి ఇంట్లోనూ కొత్తగా ఆలోచించే ప్రతిభ ఉంటుందని పేర్కొన్నారు. ఆలోచన చిన్నదైనా ప్రజల శ్రమను తగ్గించి, సమయం, ఖర్చును ఆదా చేయగలిగితే అది సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. వయస్సు, చదువుతో సంబంధం లేకుండా ప్రజలు తమ ఆలోచనలను ముందుకు తీసుకువచ్చేలా ప్రోత్సహించాలన్నారు. స్థానికంగా రూపొందించిన పరికరాలు, వినూత్న పని విధానాలు, వాటి ఉపయోగాలను గుర్తించి సంబంధిత వివరాలను సేకరించాలని సూచించారు.
ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని ఆవిష్కర్తలను గుర్తించడంలో చొరవ చూపాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు తమ పరిసరాల్లోని సమస్యలను పరిశీలించి, వాటికి పరిష్కారాలు ఆలోచించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఉపయోగకరమైన ఆవిష్కరణలను మరింత మెరుగుపరిచేందుకు సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి, తగిన మార్గదర్శకత్వం అందేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోహెల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, ఈడిఎం దేవేందర్, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.