క్షుద్ర పూజల వివాదం.. కోర్టులో పంచాయితీ!

29-10-2026 | 12:22pm

నాంపల్లి: వర్షాలు పడకుండా క్షుద్ర పూజలు చేశారంటూ వచ్చిన ఆరోపణల వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరింది. ఈ వివాదానికి సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు దాఖలు చేసిన పరువునష్టం కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది.

తనపై అసత్య ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మహేశ్ కుమార్ గౌడ్‌లపై హరీష్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే హరీష్ రావు వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోలు, వార్తాపత్రికల కత్తిరింపులను ఆధారాలుగా స్వీకరించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఈ కేసులో అద్దంకి దయాకర్, మహేశ్ కుమార్ గౌడ్‌లకు న్యాయస్థానం సమన్లు (Court Summons) జారీ చేసింది. తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విచారణకు హాజరయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఆసక్తి నెలకొంది.

కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 26కు వాయిదా వేసింది. వర్షాలు, క్షుద్ర పూజల చుట్టూ ప్రారంభమైన రాజకీయ ఆరోపణల వివాదం ప్రస్తుతం పరువునష్టం కేసుగా కొనసాగుతోంది. తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు