ఉపాధి పనులతో పూర్తి వేతనం పొందాలి
కూలీలకు డీఆర్డీఓ సన్యాసయ్య సూచన.. పనులు, పింఛన్ల వెరిఫికేషన్
చివ్వెంల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ఉపాధి హామీ పనులను(Employment guarantee works) కూలీలు సద్వినియోగం చేసుకుంటూ, నిర్దేశించిన కొలతల ప్రకారం పనిచేసి రోజుకు పూర్తి వేతనం రూ.308 పొందాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. గురువారం చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌లో జరుగుతున్న వీబీ-జీ రాంజీ పనులను ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలందరూ ఉపాధి పనులకు హాజరై, సమష్టిగా పనిచేయాలని కోరారు. కూలీలకు పూర్తి వేతనం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొత్త పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకయ్య, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.