కొండా సారీ.. గులాబీ కారు ఎక్కేందుకేనా?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ మరోసారి చర్చనీయాంశంగా మారారు. గతంలో హీరోయిన్, కేటీఆర్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆమె విచారం వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమె చేసిన ట్వీట్ (Tweet) నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత రాజకీయంగా పెద్దగా హడావుడి చేయని కొండా సురేఖ.. గత వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే ప్రశ్నలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి. దీంతో ఆమె బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరోవైపు, త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి పెరిగింది. ఆమె బీఆర్ఎస్కు దగ్గరవ్వాలని చూస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు చర్చిస్తున్నారు. గతంలో విమర్శలు చేసిన నేతలతో మళ్లీ స్నేహం చేస్తారా? గులాబీ పార్టీలో చేరే ఆలోచన ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అయితే, కొండా సురేఖ బీఆర్ఎస్లో చేరతారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె ట్వీట్‌ను రాజకీయ మార్పునకు సంకేతంగా భావించాలా? లేక గత వ్యాఖ్యలపై వ్యక్తం చేసిన విచారంగానే చూడాలా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. కొండా సురేఖ వ్యక్తం చేసిన విచారం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయా? ఆమె బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందా? అనే అంశాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది