వైఎస్సార్ నగర్ పేదల గుడిసెల కూల్చివేత అత్యంత దుర్మార్గం

29-10-2026 | 03:06pm
  1. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసమే ఉపయోగించాలి.
  2. బిజెపి నాయకురాలు రావు పద్మ రెడ్డి.

హనుమకొండ, అక్టోబర్ 29(విజయ క్రాంతి):కాజీపేట లోని వైఎస్సార్ నగర్‌ లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేద ప్రజల గుడిసెలను అక్రమంగా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి నాయకురాలు రావు పద్మ రెడ్డి(BJP leader Rao Padma Reddy) స్పష్టం చేశారు.

గురువారం  కాజీపేట వైఎస్సార్ నగర్‌ లో భూ కబ్జాదారులు అక్రమంగా గుడిసెలు కూల్చివేస్తున్నారని సమాచారం మేరకు రావు పద్మ రెడ్డి స్థానిక బిజెపి నేతలతో కలిసి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ కూల్చివేతలను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కబ్జాదారులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ సుమారు 25 ఏళ్లుగా ఇక్కడ నివాసముంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదల బతుకులను ఒక్కసారిగా ఆందోళన లోకి నెట్టేయడం దారుణం అని, ఇంట్లో యజమానులు లేని సమయం చూసి, ఆకస్మికంగా బయట వ్యక్తులు వచ్చి గుడిసెలను కూల్చివేయడం అత్యంత అమానుష చర్య అన్నారు. అధికార, రాజకీయ అండదండలతోనే ఈ రకమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని,ఇది స్పష్టంగా అధికార యంత్రాంగం మరియు పోలీసు శాఖ వైఫల్యానికి నిదర్శనం" అని మండిపడ్డారు.

వైఎస్సార్ నగర్ గుడిసె వాసులకు తక్షణమే పునరావాసం కల్పించి, తగిన పరిహారం అందించే వరకు పేదల పక్షాన నిలబడి చివరి వరకు పోరాడతామని ఆమె హామీ ఇచ్చారు. వైఎస్సార్ నగర్ నివాసుల కు ఏ చిన్న హాని లేదా అన్యాయం జరిగినా దానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంపూర్ణ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పేదల పొట్టగొట్టే రాజకీయాలను, అక్రమ కూల్చివేత లను సహించేది లేదని హెచ్చరిస్తూ, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రావు పద్మ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల శ్రీకాంత్ పటేల్, మామిడాల నరేందర్, నర్సింగ్ గౌడ్, భగవాన్ ఉపాధ్యాయ, శ్రావణ్ యాదవ్, శ్రీకాంత్ ముదిరాజ్, కళ్యాణ్, శ్రావణ్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు