నటన నాకంటే ఉత్తమంగా..
యువ హీరోపై రామ్‌చరణ్ ప్రశంసలు
అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. మహేశ్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. నాగార్జున, రామ్‌చరణ్, అఖిల్ అక్కినేని, టీఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, ఈ సినిమాలో అనీష్ నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు.
మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేం. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నా” అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. “రామ్‌చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది.
అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అనీష్ ప్రేమ అందరికీ వినిపిస్తుంది” అన్నారు. ‘మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాకు మంచి సక్సెస్ ఇద్దాం’ అని దిల్ రాజు తెలిపారు. అనీష్ మాట్లాడుతూ.. “అర్జున్ మాట్లాడలేకపోవచ్చు కానీ, తన ప్రేమ ప్రేక్షకులందరికీ వినిపిస్తుంది” అన్నారు. ‘కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది’ అని హీరోయిన్ అనస్వర రాజన్ చెప్పింది.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “మాటలు లేకుండా సినిమా అనుకున్నప్పుడు అందరూ రిస్క్ అని అన్నారు. నాగార్జున, అఖిల్, చరణ్.. వీళ్లందరూ రిస్క్ తీసుకుని, హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చారు.
వీళ్లందరినీ చూస్తున్నప్పుడు మేము ఎందుకు రిస్క్ తీసుకోకూడదనిపించింది” అని చెప్పారు. ‘నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాన’ని చిత్ర దర్శకుడు మహేశ్ అన్నారు. ఇంకా ఈ వేడుకలో హీరో అఖిల్, నిర్మాత రవిశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డీవోపీ రాజా మాట్లాడారు. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.