ఎన్విడియాకు షాక్.. 2 రోజుల్లో 400 బిలియన్ డాలర్ల ఆవిరి!
ప్రపంచ చిప్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా (NVIDIA)కు స్టాక్ మార్కెట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారం, ఆయన విదేశీ నిఘా వలలో చిక్కి ఉండొచ్చన్న ఆరోపణలపై బోర్డు విచారణ ప్రారంభించడం, ఏఐ రంగంలో పెట్టుబడుల భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలు షేర్లపై ప్రభావం చూపాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే ఎన్విడియా షేర్లు 6 శాతానికిపైగా పడిపోయాయి. ఫలితంగా ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయి మైక్రోసాఫ్ట్‌కు ఆ స్థానాన్ని వదులుకుంది.
నవంబర్ 9, 10 తేదీల్లో వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఎన్విడియా.. రెండు ట్రేడింగ్ సెషన్లలో కలిపి సుమారు 430 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయినట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. మంగళవారం ట్రేడింగ్‌లో షేరు ధర 6 శాతానికిపైగా పతనమై 167 డాలర్ల స్థాయికి చేరింది. దీంతో ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 4.02 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. మైక్రోసాఫ్ట్ విలువ 4.03 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆపిల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం చుట్టూ నెలకొన్న వివాదం కంపెనీకి ఇబ్బందికరంగా మారింది. తన వైవాహిక బంధానికి ద్రోహం చేసినట్లు హువాంగ్ ఉద్యోగులకు పంపిన సందేశంలో అంగీకరించి క్షమాపణలు కోరినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press) కథనం వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఆలిస్ హువాంగ్ అనే చైనా పౌరురాలి పేరు తెరపైకి వచ్చింది. ఆమె చైనా నిఘా సంస్థలతో సంబంధాలు కలిగి ఉండొచ్చన్న ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. జెన్సన్ హువాంగ్ విదేశీ నిఘా ప్రయత్నానికి లక్ష్యంగా మారారా? అనే కోణంలో పరిశీలన సాగుతోంది. అయితే చైనా నిఘా సంబంధాలపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. చైనా విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రంగంలో భారీ పెట్టుబడులపై మార్కెట్‌లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ డేటా సెంటర్లు, అధునాతన చిప్‌ల కోసం టెక్ కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నా.. వాటి ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తుందా? అనే ప్రశ్నలు పెట్టుబడిదారులను వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలు ఏఐ చిప్‌ల తయారీలో కీలక సంస్థగా ఉన్న ఎన్విడియా షేర్లపై మరింత ఒత్తిడి పెంచాయి.
ఏఐ విప్లవానికి అవసరమైన చిప్‌లను అందిస్తూ గత కొన్నేళ్లుగా అసాధారణ వృద్ధిని నమోదు చేసిన ఎన్విడియాకు తాజా పరిణామాలు సవాలుగా మారాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, ఏఐ వ్యాపారంపై పెట్టుబడిదారుల్లో ఉన్న విశ్వాసం ఆ సంస్థ మార్కెట్ విలువకు మద్దతుగా నిలుస్తోంది. వ్యక్తిగత వివాదం, నిఘా ఆరోపణలపై విచారణ, ఏఐ పెట్టుబడులపై అనిశ్చితి.. ఇలా మూడు వైపుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని ఎన్విడియా ఎలా అధిగమిస్తుందో చూడాలి!