‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’ ట్రైలర్‌ విడుదల

29-10-2026 | 11:41pm

ముంబై: ప్రేక్షకులను మరోసారి సెయింట్‌ థెరెసా  క్యాంపస్‌లోకి తీసుకెళ్లబోతూ, జియో హాట్‌స్టార్‌(Jio Hotstar) ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’ ట్రైలర్‌ను విడుదల చేసింది.  ఓ అనుమానాస్పద మరణం చుట్టూ సాగే ఈ సిరీస్‌లో ఆశయాలు, పోటీ, హత్య మిస్టరీ కలగలిసి ఉంటాయి.

సెయింట్‌ థెరెసా  క్యాంపస్‌లో అందరి దృష్టిని ఆకర్షించే విద్యార్థిని ఆయేషా మాలిక్‌ (షనాయా కపూర్‌) మృతదేహం లభ్యమైనప్పుడు, అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమని ఆమె కవల సోదరి అదితి (షనాయా కపూర్‌) అంగీకరించదు. నిజాన్ని వెలికితీయాలని నిర్ణయించుకున్న అదితి, పాఠశాలలోకి ప్రవేశించి తీవ్ర పోటీతో కూడిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో పాల్గొంటుంది. అయితే, తన సోదరికి అత్యంత సన్నిహితులైన వారే ఆమెకు గట్టి పోటీదారులని తెలుసుకుంటుంది. హంతకుడిని కనిపెట్టాలంటే ఆమె ఏదైనా చేయాల్సిందే... పోటీలో ప్రవేశించాలి, నిలదొక్కుకోవాలి, గెలవాలి. 

అగ్రస్థానానికి చేరుకోవాలనే తపన వ్యసనంగా మారుతున్న, ఆశయం మనుషులను హద్దులు దాటించేలా చేస్తున్న తరానికి ఈ సిరీస్‌ అద్దం పడుతుంది. ఈ క్రమంలోనే  ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’ ఓ ప్రశ్ననూ  సంధిస్తుంది... గెలవడానికి మీరు ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు?

ఒరిజినల్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ విజయం సాధించాలనే కల గురించి చెబితే.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’ గెలుపు కోసం చెల్లించాల్సిన మూల్యం గురించి చెబుతుంది. షనాయా కపూర్‌ మాట్లాడుతూ.. “ఆయేషా, అదితి పాత్రల్లో నటించడం నటిగా నాకు అత్యంత సవాలుతో కూడిన, సంతృప్తినిచ్చిన అనుభవాల్లో ఒకటి. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’లో నాకు బాగా నచ్చిన అంశం,  ఎంతో ఆదరణ పొందిన ఈ ఫ్రాంచైజీని అనూహ్యమైన, కొత్త కోణంలోకి తీసుకెళ్లడం. ఇక్కడ పందెం కేవలం పోటీ, టైటిల్‌ గెలవడం మాత్రమే కాదు.. అంతకుమించిన అంశాలు ఉన్నాయి” అని చెప్పారు. దర్శకురాలు రీమా మాయా మాట్లాడుతూ.. “స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ అనేది పట్టుదల, ఆవేదన, హృదయానికి సంబంధించిన కథ.

ఇది నేటి యువత కోసం రూపొందించిన సిరీస్‌.  మేం సృష్టించిన కొత్త ప్రపంచానికి ట్రైలర్‌ ఓ చిన్న పరిచయం మాత్రమే. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ముందున్నాయి!  విజయం సాధించాలనే తపన సర్వస్వంగా మారితే ఏమవుతుంది? అది స్నేహాలను, చివరకు మనల్ని మనమే ఎలా నాశనం చేస్తుంది? అనేదే ఇందులో ప్రధానాంశమని అన్నారు. ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు రీమా మాయా దర్శకత్వం వహించారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌’ సిరీస్‌ నవంబర్‌ 13 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని వార్తలు