అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు
- సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయాలు జరిపేందుకు వీలుగా శ్రీనాథ్ ట్రేడర్స్ నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను(Rice Sales Outlet) ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి వేణు గోపాల్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకళతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి అమ్మకాలు జరుపకూడదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బి.పి.టి, హెచ్.ఎం.టి. తదితర రకాల బియ్యంను ప్రభుత్వ నిర్దేశిత ధరలకు అందించేందుకు గజానన్ ఇండస్ట్రీస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని కోరారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. రా రైస్ బ్యాగ్ ను 1430 రూపాయలు, హెచ్.ఎం.టి స్టీమ్ రకం బియ్యం బస్తా 1898 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు.