జైపూర్ లో కలెక్టర్ పర్యటన
జైపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను(Government educational institutions), పలు అభివృద్ధి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) పరిశీలించారు. మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు.
నిర్ణీత మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంట శాలను పరిశీలించారు.
విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఎంపిసి విద్యార్థులకు గణిత బోధన జరుగుతున్న తీరును పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంజూరైన పడకలు, పరుపులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.