తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ రెడ్డి సంఘం ఫిర్యాదు
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): రెడ్డి సామాజిక వర్గం(Reddy community)పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రెడ్డి సంఘం(Telangana Reddy Association) తరఫున. మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమర్పించిన ఫిర్యాదులో, సెప్టెంబర్ 5న ముఖ్యమంత్రి సభ సందర్భంగా మునుగోడు శాసనసభ్యుడి కుటుంబాన్ని, అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యల వల్ల రెడ్డి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని, తమను అవమానించినట్లుగా భావిస్తున్నామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘం తరఫున పోలీసులను కోరారు.