ఇన్‌చార్జీలతో ఇంకెన్నాళ్లు!
- ఆరు ముఖ్య శాఖలలో.. అన్నింటా ఇన్‌చార్జిలే
- అధికారుల కొరతతో సేవలకు బ్రేక్
నేరేడుచర్ల, నవంబర్ 22: నేరేడుచర్ల మండలంలో కీలక ప్రభుత్వ శాఖలు(Government Departments) పూర్తిస్థాయి అధికారుల కొరతతో ఇన్చార్జిల పాలనలో(Rule by In-charges) కొనసాగుతుండటంతో ప్రభుత్వ సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అధికారులు బదిలీపై వెళ్లడం,పదవీ విరమణ చేయడం, మరోవైపు ఖాళీ పోస్టులను నెలల తరబడి భర్తీ చేయకపోవడంతో ఆయా శాఖల విధులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు సకాలంలో అందకపోవడమే కాకుండా,అభివృద్ధి పనుల పురోగతి,క్షేత్రస్థాయి పర్యవేక్షణపైనా ప్రభావం పడుతున్నట్లు కనిపిస్తోంది.
ఎంపీడీఓ పోస్టుకు ఇన్చార్జి.. అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఎలా?
మండల అభివృద్ధి అధికారిగా పనిచేసిన సోమ సుందర్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో పాలకవీడు ఎంపీడీఓకు నేరేడుచర్ల మండల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.రెండు మండలాల బాధ్యతలు ఒకే అధికారిపై ఉండటంతో క్షేత్రస్థాయి పర్యటనలు,ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సమీక్షలకు ఎంత సమయం కేటాయించగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ట్రాన్స్‌కోలోనూ అదనపు బాధ్యతలే..
ట్రాన్స్‌కో ఏఈ సృజన బదిలీపై వెళ్లడంతో పాలకవీడు ట్రాన్స్‌కో ఏఈ పందిరి శ్రీనివాస్‌కు నేరేడుచర్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.విద్యుత్ సరఫరా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు, లో వోల్టేజీ వంటి అంశాలపై తక్షణ స్పందన అవసరమైన శాఖలో అదనపు బాధ్యతలతో పాలన సాగుతోంది.
సర్వేయర్ లేక నెలల తరబడి రైతుల నిరీక్షణ
మండల సర్వేయర్ బదిలీ అయి నెలలు గడుస్తున్నా పోస్టును భర్తీ చేయకపోవడంతో భూ సమస్యలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివాదాల పరిష్కారం కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉప పశువైద్యశాలలో సిబ్బంది కొరత
చిల్లేపల్లి ఉప పశువైద్యశాలలో ఎల్ఎస్ఏ బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది.పశువులకు సకాలంలో చికిత్స అందకపోతే వ్యాధులు ముదిరి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
పంచాయతీరాజ్ శాఖకు పాలకవీడు ఏఈ ,పంచాయతీరాజ్ శాఖలో నేరేడుచర్ల ఏఈ బాధ్యతలను పాలకవీడు ఏఈ ఇన్చార్జిగా నిర్వహిస్తున్నారు.రెండు మండలాల పనులను ఒకే అధికారి పర్యవేక్షించాల్సి వస్తే పనుల పరిశీలన, అంచనాల తయారీ, బిల్లుల పరిశీలన వంటి అంశాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఆర్ అండ్ బి శాఖలోనూ గరిడేపల్లి ఏఈ కే అదనపు బాధ్యత ఆర్ అండ్ బి శాఖలో నేరేడుచర్ల ఏఈ బాధ్యతలను గరిడేపల్లి ఏఈ ఇన్చార్జిగా నిర్వహిస్తున్నారు.రహదారుల నిర్వహణలో జాప్యం ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది.
ప్రజలకు కావాల్సింది అందుబాటులో ఉండే అధికారులు!
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారుల హోదాల కంటే తమ సమస్య పరిష్కారం కావడమే ముఖ్యం. అధికారుల కొరతతో అభివృద్ధి పనులు,ప్రజా సేవలు కుంటుపడకుండా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మండలంలోని శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.