ప్రభుత్వ భూములను అమ్మొద్దు
- మియాపూర్‌లో 850 ఎకరాలు హాస్టళ్లు, గురుకులాలకు కేటాయించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను(Government lands) విక్రయించకుండా పేదలు, విద్యార్థుల సంక్షేమానికి వినియోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య (MP R. Krishnaiah)డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని 850 ఎకరాల భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు కేటాయించాలని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో వందలాది మంది విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 325 బీసీ హాస్టళ్లు, 320 బీసీ గురుకులాలు, 50 ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం విచారకరమన్నారు.
అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఐదుగురు ఉండాల్సిన గదుల్లో 20 నుంచి 30 మంది ఉంటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యాలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను హాస్టళ్లు, గురుకులాలు, పేదల ఇళ్ల నిర్మాణాలకు వినియోగించాలని, అదనంగా150 బీసీ కాలేజీ హాస్టళ్లు,100 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని కోరారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదనంగా150 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు. 240 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. రాజేందర్, నరేష్ గౌడ్, శివ ముదిరాజు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.