సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి
- కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే రైతుకు సాగునీటి భరోసా
- కాళేశ్వరం నుంచి ఆశించిన ప్రయోజనం అందలేదు: మంత్రి ఉత్తమ్
నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం(State Government) చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను(Welfare program), సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి పునాదులని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అంకితభావంతో పనిచేసే సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కాంగ్రెస్‌లో ఉందని తెలిపారు.
క్షేత్రస్థాయి కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి నాయకులుగా తీర్చిదిద్దడం పార్టీ సంప్రదాయమని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రజలు తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నుకున్నారని గుర్తుచేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని.. కొత్త రేషన్ కార్డుల జారీ, అర్హులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ ఆహార భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలని వివరించారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి, ఇతర పంటల ఉత్పత్తి నమోదవుతున్నదని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన కారణమని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని చెప్పారు. ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఆశించిన ప్రయోజనం అందించడం లేదు. దాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి మరింత వ్యయం అవసరమవుతుంది. ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉంది’ అని తెలిపారు.
సమావేశంలో విరిసిన నవ్వులు
పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆహ్లాదకరంగా చర్చ జరిగింది. నాయకుల మధ్య నవ్వులు విరిశాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు తెప్పించాయి. ‘మాది కుటుంబ పార్టీ కాదు. నాకు గానీ, సీఎం రేవంత్‌రెడ్డికి గాని రాజకీయ వారసులు లేరు. మంత్రి ఉత్తమన్నకు కూడా వారసులు లేరు. నాకు ఉత్తమన్న అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు పిల్లలు లేరు.. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరూ లేరు.
నన్ను దత్తత తీసుకుంటే పోతాను’ అని మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. అందుకు మంత్రి ఉత్తమ్ కూడా స్పందించి.. ‘నాకు ఉన్న అప్పులకు దత్తత రావాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. అందుకు మహేశ్‌గౌడ్.. ఉత్తమన్న అప్పులకు కూడా దత్తత పోతానని అనడంతో సభలో నవ్వులు పూశాయి. సీఎం రేవంత్ స్పందిస్తూ.. రోహిణ్‌రెడ్డి కూడా దత్తత కోసం చూస్తున్నారని, సంపత్ కుమార్ కూడా అదే పనిలో ఉన్నారని అనడంతో సభలో మరింత నవ్వులు విరిశాయి.