డేటా సెంటర్లను విస్తరించండి
- తెలంగాణలో తయారీ యూనిట్ల పెంపునకు అనువైన సమయం
- విద్యుదీకరణ, ఆటోమేషన్, డిజిటలైజేషన్లో అపార అవకాశాలు
- ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి
- పారిస్‌లో సంస్థ కార్యాలయం సందర్శన
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఎనర్జీ టెక్నాలజీ(International Energy Technology) దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ తన కార్యకలాపాలను తెలంగాణలో మరింతగా విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కోరారు. డేటా సెంటర్ల హబ్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యుదీకరణ, డిజిటలైజేషన్ మరియు ఆటోమేషన్ విభాగాల్లో ఆ సంస్థకు అపారమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ అనుకూలతలను వినియోగించుకుని తెలంగాణలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా పారిస్‌లోని ష్నైడర్ ఎలక్ట్రిక్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యురాలు గ్వెనెల్ హుయెట్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతోసమావేశం అయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై వారికి వివరించారు. భవిష్యత్తులో సంస్థ మొత్తం ఆదాయంలో 30 శాతానికి పైగా డేటా సెంటర్ల నుంచే వచ్చే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణలో యూనిట్ల విస్తరణకు ముందుకు రావాలని పేర్కొన్నారు.
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ.. తెలంగాణలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న సంస్థకు.. తయారీ, పరిశోధన-, విక్రయాలు తదితర విభాగాల్లో 5 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థ తెలంగాణ యూనిట్ అంతర్జాతీయంగా ఆదర్శవంతమైన యూనిట్‌గా గుర్తింపు పొందడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 30న సంస్థ నూతన సదుపాయం ప్రారం భం కానున్న నేపథ్యంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రతినిధులకు ముందస్తు అభినందనలు తెలిపారు.
పెట్టుబడులు, భాగస్వామ్యంపై చర్చ..
సంస్థ అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలు, భారత్‌లో విస్తరించిన కార్యకలాపాలు, తెలంగాణతో పెరుగుతున్న భాగస్వామ్యంపై భేటీలో చర్చించారు.అత్యాధునిక ఎనర్జీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఆధారిత ఆటోమేషన్ పరిష్కారాల వినియోగంపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. విద్యుదీకరణ, ఆటోమేషన్, డిజిటల్ సాంకేతికతల సమన్వయంతో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా, పటిష్టంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ష్నైడర్ ఎలక్ట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. పారిస్‌లో సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశం తెలంగాణతో సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణకు కొత్త అవకాశాలను తెరిచిందని డిప్యూటీ సీఎం వెంట ఉన్న సీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణలో సంస్థ నిరంతర వృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.