ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలు సెమీఫైనల్

23-11-2026 | 05:15am
  1. సమన్వయంతో పనిచేయండి  
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలి
  3. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు, ఇన్‌చార్జి సునీల్ బన్సల్ పిలుపు 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ((Graduate MLC)), మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను(Municipal Corporation Elections) అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణించి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు, గత బీఆర్‌ఎస్ పాలనలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.

జిల్లాల వారీగా ఓటరు నమోదుపై సమీక్షించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటరు నమోదును మరింత విస్తృతం చేయడం, బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో ఓటర్లను నేరుగా కలవడంపై దృష్టి సారించాలని పార్టీ నాయకులకు సూచించారు.

ముఖ్యంగా ఐటీ కారిడార్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అపార్ట్‌మెంట్లకు వెళ్లి అర్హులైన పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించాలని పేర్కొన్నారు.‘సేవాదూత్ అభియాన్’ కార్యక్రమాలను కూడా ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని, అభ్యర్థి ఎవరన్నది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని వారు వెల్లడించారు. 

రాజ్యాంగ దివస్, సేవాదూత్ కార్యక్రమాలు నిర్వహించాలి

సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని రాంచందర్‌రావు, సునీల్ బన్సల్ పార్టీ నేతలకు సూచించారు. ఈనెల 26న రాజ్యాంగ దివస్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఇందకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

అదే విధంగా డిసెంబర్ 1 నుంచి 25 రోజులపాటు సేవా దూత్ అభియాన్ నిర్వహించాలని వివరించారు. రాష్ర్టంలో ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.  

ఆర్థిక ప్రగతిని పట్టభద్రులకు వివరించండి

భారత ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న వృద్ధి, వివిధ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులను పట్టభద్రులు, మేధావులకు వివరించాలని రాంచందర్‌రావు సూచించారు. అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కావడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ వంటి సంస్థలు సైతం భారత వృద్ధి రేటు 7 శాతం పైనే ఉంటుందని అంచనా వేశాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలోని ‘గరీబీ హఠావో’ నినాదానికి, ప్రస్తుత గణాంకాలకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. 2014కు ముందు 27.10 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం ఇప్పుడు 2.6 శాతానికి తగ్గిందని, యూపీఏ హయాంలో 9.49 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.1 శాతానికి తగ్గిందని తెలిపారు. గతంలో 30-ః31 శాతంగా ఉన్న పరోక్ష పన్నులు, జీఎస్టీ రేట్లు ఇప్పుడు సుమారు 9.5 శాతానికి తగ్గాయని చెప్పారు.

గతంలో 8 నెలల వరకు సమయం పట్టిన ఆదాయపు పన్ను రీఫండ్‌లు ఇప్పుడు వారంలోపే వస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.6 కోట్ల మంది ఫార్మల్ నెట్‌లోకి చేరారని ఆయన తెలిపారు. ప్రధాని  మోదీ నాయకత్వంలోని గత పదేళ్లు భారత ఆర్థిక వ్యవస్థకు ‘స్వర్ణ దశాబ్దం’ అని, యూపీఏ పాలన ‘కోల్పోయిన దశాబ్దం’ అని రాంచందర్‌రావు అభివర్ణించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ నేతలందరూ భారత ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తున్న సమయంలో.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమురయ్య, అంజిరెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు