అమిత్ షా పర్యటన ఫ్లాప్.. పొన్నం ఫైర్!
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ను విమర్శించడానికే ఆయన పర్యటన పరిమితమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ విభజన హామీలు, కేంద్ర నిధులు, రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల వాటా ఎంత? తిరిగి రాష్ట్రానికి ఇస్తున్న నిధులెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision), అర్హులైన ఓట్ల తొలగింపుపై పార్లమెంట్లో చర్చకు రావాలని అమిత్ షాకు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, ఉద్యోగ నియామకాలను ప్రస్తావించారు. బీజేపీ ఎన్నికల హామీల అమలుపైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణలో కరువు పరిస్థితులపై కేంద్రం తక్షణమే స్పందించి సహాయం అందించాలని పొన్నం కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ర్యాలీలు నిర్వహించే ముందు కేంద్ర ప్రభుత్వం తన పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.