సమాధుల వద్ద కొవ్వొత్తుల వెలుగులు.. ఆత్మీయుల జ్ఞాపకాల స్మరణ
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని సులానగర్, కోయగూడెం, మాలపల్లి, ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ గ్రామాల్లో(Mutyalampadu Crossroad village) సోమవారం సమాధుల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధులను శుభ్రపరిచి పూలతో అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా ఆర్‌సీఎం చర్చ్ ఫాదర్ ఆర్లయ్య, సీఎస్‌ఐ పాస్టర్ దగ్గుపాటి మనోహర్ వాక్యాన్ని బోధిస్తూ, సమాధుల పండుగ అనేది పూర్వీకులను, మరణించిన ఆత్మీయులను స్మరించుకునే పవిత్రమైన రోజని తెలిపారు. మనకు దూరమైన వారి జ్ఞాపకాలను ప్రేమతో గుర్తు చేసుకోవడంతో పాటు కుటుంబ బంధాలు, ప్రేమ, ఐక్యతను చాటిచెప్పే గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలే ప్రసాద్‌రావు, గండూరి సంజీవరావు, కాలే భాస్కరరావు, అంతోటి నాగేశ్వరరావు, ముచ్చ సుధాకర్, అంతోటి రాకేష్, కాలే అభినయ్, అంతోటి రాము, ఉల్లోజి సత్యం తదితరులు పాల్గొన్నారు.