రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

02-11-2026 | 06:43pm

వనపర్తి: తెలంగాణలో సాగునీటి(Irrigation) అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. పాలమూరు ప్రాంత రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(BRS MLA Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్(BRS) బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూరాల, కల్వకుర్తి ప్రాంతాలకు నీటి లభ్యత ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో సాగునీటిని వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. జూరాలకు 252 టీఎంసీల నీరు వచ్చిందని, రోజుకు 9,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నప్పటికీ వినియోగించుకోలేదని ఆరోపించారు. జూరాల, శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదిలేశారని విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టుపై ప్రశ్నలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Scheme)లో సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, అయినప్పటికీ మోటార్లను పూర్తిస్థాయిలో నడపడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో పాలమూరు ప్రాంతంలో సాగునీటి పరిస్థితి మెరుగుపడలేదని విమర్శించారు. జిల్లాలో కొత్తగా ఒక్క చెరువు లేదా చెక్‌డ్యామ్ నిర్మించారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాగునీటి విషయంలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులకు సాగునీరు ఎక్కడ?

వానాకాలం పంటల నష్టాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని హరీశ్ రావు పేర్కొన్నారు. యాసంగి సాగుకు నీరు, విద్యుత్ అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ.. యాసంగిలో నీళ్లకు, కరెంటుకు, చివరకు పంటలకు కూడా సెలవు ప్రకటించినట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు రైతులకు సాగునీటి భరోసా కల్పించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు