కోదాడ 16వ వార్డులో వృధాగా ప్రవహించిన మిషన్ భగీరథ నీరు

02-11-2026 | 08:56pm

కోదాడ నవంబర్ 02(విజయ క్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డు నయా నగర్ లో అధికారుల సమన్వయ లోపం,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యూజీడి పనుల నిమిత్తం జెసిబీ డ్రిల్లింగ్ మిషన్ తో సిమెంట్ రోడ్లను ఇష్టానుసారంగా పగలగొడుతుండటంతో కింద ఉన్న మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్(Mission Bhagiratha drinking water pipeline) పూర్తిగా ధ్వంసమైంది.

గంటపాటు రోడ్లపైన ప్రవహించిన భగీరథ నీరు:

సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో నయా నగర్ కాలనీకి మిషన్ భగీరథ తాగునీటిని విడుదల చేశారు. అయితే అప్పటికే డ్రైనేజీ పనుల కోసం డ్రిల్ చేసిన చోట పైప్ లైన్ పగిలిపోవడంతో.. ఉదయం సరఫరా అయిన తాగు నీరు అంత దాదాపు గంటపాటు వృధాగా రోడ్లపై, డ్రైనేజీ గుంతల్లో ప్రవహించింది. దీంతో కాలనీ వీధిలో జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఇంజనీరింగ్ అధికారులు ఏమైనట్టు..?

సాధారణంగా ఇలాంటి భూగర్భ పనులు చేపట్టే ముందు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వాటర్ పైప్ లైన్లు ఎక్కడ ఉన్నాయో ముందస్తుగా మ్యాపింగ్ చేసి కాంట్రాక్టర్లకు దిశా నిర్దేశం చేయాలి. కానీ, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. 

ప్రజాధనం వృధా.. ప్రజల ఆగ్రహం: 

ఒకవైపు తాగునీటి కోసం కాలనీవాసులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల లీటర్ల కొద్ది శుద్ధి చేసిన తాగునీరు వృధా కావడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా దానంతో నిర్మించిన పైప్ లైన్లను ఇలా నిర్లక్ష్యంగా ధ్వంసం చేస్తూ ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  సమన్వయంతో పనులు జరిగేలా చూడాలని నష్టపోయిన పైప్ లైన్ కు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

పైపులు పగలడం సహజం: డీఈ స్వాతి

సహజంగానే పైపులు పగులుతుంటాయి. పైపులు పగిలినప్పుడు నీరు వృధా అవుతుంటుంది. అధికారులకు చెబుతాను, వారు సమస్య పరిష్కరిస్తారు.

మరిన్ని వార్తలు