కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా

02-11-2026 | 09:21pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కేంద్రంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ(Government Land Encroachment) వ్యవహారం కలకలం రేపుతోంది. జగిత్యాల పట్టణ శివారు సర్వే నెంబర్ 1601 లో గల ప్రభుత్వ భూమి, దానికి ఆనుకొని ఉన్న పాత నిజామాబాద్ రోడ్డును కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ హస్తాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డి. రాజవ్వ, జగిత్యాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు, స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు.

ఈ వివాదాస్పద భూమి జగిత్యాల మున్సిపాలిటీకి, హస్తాబాద్ గ్రామానికి మధ్యలో, జి.ఆర్. ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారి ఎన్ హెచ్ - 63 ను ఆనుకొని ఉందని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. గతంలో ఈ భూమి విషయంలో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు స్వయంగా వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించి, ఇది ప్రభుత్వ రెవెన్యూ భూమి అని సూచిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారని సర్పంచ్, కౌన్సిలర్ గ్రామస్తులు తెలిపారు.

మళ్ళీ తెరపైకి కబ్జా

అయితే గత నాలుగు (4) నెలల క్రితం కొందరు వ్యక్తులు ప్రభుత్వం పెట్టిన హద్దురాళ్లను తొలగించి, ఆ భూమిని జెసిబిలతో చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ప్రజలు ఉపయోగిస్తున్న పాత నిజామాబాద్ రోడ్డును కూడా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సర్వేయర్ ను పంపిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎవరూ రాలేదని, సర్వే చేయలేదని, హద్దులు మళ్ళీ నిర్ణయించలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమిని, ప్రజల రాకపోకలకు ఉపయోగపడే పాత రోడ్డును కాపాడాలని, వెంటనే రెవెన్యూ సర్వేయర్ ను పంపి తిరిగి హద్దులు నిర్ణయించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సర్పంచ్ రాజవ్వ, కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు, ప్రజలు హెచ్చరిoచారు. హస్నాబాద్ సర్పంచ్, కౌన్సిలర్ లతో పాటు మాజీ సర్పంచ్ కరుణాకర్ రావు, మహేష్, వంశీ, రవి, బత్తుల గంగాధర్, రాజేశం, దామోదర్ రావు, లక్ష్మణ్ రావు, గంగయ్య, వెంకటేష్, భగవంత రావు, మల్లారెడ్డి, రాం మోహన్ తదితరులు కలెక్టర్ ను కోరారు.

మరిన్ని వార్తలు