మల్లారెడ్డి ఫామ్‌హౌస్‌పై హైడ్రా బుల్డోజర్

02-11-2026 | 08:40pm

హైదరాబాద్: హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా మరోసారి కూల్చివేతల చర్యలు చేపట్టింది. ఫాక్స్‌సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ, ప్రధాన ప్రవేశ ద్వారాన్ని జేసీబీలతో తొలగించినట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లా దూలపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 124 పరిధిలో ఈ ఫామ్‌హౌస్ ఉన్నట్లు తెలుస్తోంది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే భూమిని ఫామ్‌హౌస్ సరిహద్దుల్లో కలుపుకుని ప్రహరీ నిర్మించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సుమారు 15 ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్లు గుర్తించి, భారీ ప్రహరీ గోడతో పాటు ప్రధాన గేటును యంత్రాల సహాయంతో తొలగించారు.

కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితం కాకుండా చెరువు పరిసర ప్రాంతాల్లోనూ హైడ్రా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఇతర ప్రహరీ గోడలు, ఇనుప ఫెన్సింగ్‌లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా తొలగించినట్లు సమాచారం. ఫాక్స్‌సాగర్ చెరువును ఆక్రమణల నుంచి కాపాడి పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు