డంపింగ్ యార్డును తరలించే వరకు పోరాటం ఆగదు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ అన్నోజిగూడ లోని డంపింగ్ యార్డును పూర్తిగా తరలించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో రావుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గొంగళ్ల బాలేష్ తో కలిసి పాల్గొని డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు మద్దతు తెలిపారు.
ఈసందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్నోజిగూడ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డును పూర్తిగా తరలించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రెండు నెలల్లో తరలిస్తామని అధికారుల హామీ
డంపింగ్ యార్డు తరలింపు అంశంపై స్పందించిన అధికారులు, రెండు నెలల్లో డంపింగ్ యార్డును పూర్తిగా తరలించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు నాయకులు వెల్లడించారు. ఈ హామీని అధికారులు ఆచరణలో పెట్టి, నిర్ణీత గడువులోగా తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు.
శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ఉద్యమం
డంపింగ్ యార్డు తరలింపు విషయంలో కేవలం హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ యాదవ్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి శివనాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రణయ్, సీనియర్ నాయకులు వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డి, జిహెచ్ఎంసి బీసీ సంఘం ఉపాధ్యక్షులు అఖిల భారత రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొమ్మరాజు సతీష్, జోగు అఖిల్, పరశురాం, డంపింగ్ యార్డ్ బాధితులు, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.