పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

24-10-2026 | 08:02pm

ఆలయ పునర్నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి 

దేవాదాయ కమిషనర్ హనుమంతరావు

భూపాలపల్లి/ కాళేశ్వరం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల(Godavari Pushkarala) సందర్భంగా కాళేశ్వరంలో(Kaleshwaram) పుష్కరఘాట్ల అభివృద్ధి, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleshwara Mukteshwara Swamy) దేవస్థానం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు(Hanumantha Rao) అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరం క్షేత్రంలో పర్యటించిన ఆయన వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఆలయ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టి, అవసరమైన కార్మికులను నియమించి షిఫ్టుల వారీగా పనులు నిర్వహించాలని సూచించారు. అక్షరాభ్యాస మండపం, అద్దాల మండపం పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆలయ పునర్నిర్మాణం ప్రణాళిక, సంప్రదాయ వాస్తు నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

వచ్చే నెల 4న మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం పర్యటనకు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాలని ఆదేశించారు. పుష్కరాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తాగునీరు, రహదారులు, పార్కింగ్, ఘాట్లు, ర్యాంపులు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

భక్తుల భద్రత కోసం వాచ్ టవర్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని తెలిపారు.కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం, పుష్కరాల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని శాఖల సమన్వయంతో గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ పర్యటనలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు