హైదరాబాద్‌ నీటి కష్టాలకు కాళేశ్వరం జలాలే పరిష్కారం

24-10-2026 | 08:08pm

కన్నెపల్లి నుంచి వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోసి నగర ప్రజలను ఆదుకోవాలి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

భూపాలపల్లి/ కాళేశ్వరం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో తాగునీటి సంక్షోభాన్ని(Drinking water crisis) నివారించేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌(Kannepalli Pump House) నుండి వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి నగర ప్రజలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు(BRS MLAs) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి. వివేకానందగౌడ్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి జలాలు భారీగా దిగువకు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నా, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.

జూన్‌ నుంచి ఇప్పటివరకు సుమారు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని, కనీసం 250 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు పెరిగేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు మూడు రోజులకు ఒకసారి కూడా సక్రమంగా నీరు రావడం లేదని, తక్కువ పీడనంతో సరఫరా అవుతోందని ఎమ్మెల్యేలు తెలిపారు. వాటర్‌ ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగిందని, నగరంలో నీటి కొరత తీవ్రతకు ఇది నిదర్శనమన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కనీసం ఇప్పటికైనా కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి ప్రజల నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ నీటి సమస్యపై గతంలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విలువైన గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుండగా హైదరాబాద్‌ తాగునీటి సంక్షోభం దిశగా వెళ్లడం ఆందోళనకరమన్నారు. వెంటనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నగర ప్రజలకు తాగునీటి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు