హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి.. విపక్ష నేతల అరెస్టు
హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడి.. పలువురు నాయకులు, కార్యకర్తల అరెస్టు
హైదరాబాద్: నగరంలోని విలువైన ప్రభుత్వ భూముల వేలం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ నెల 27న జరగనున్న హెచ్ఎండీఏ ఈ-వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాయి.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, మూసాపేటలోని హుడా ట్రక్ పార్క్, మియాపూర్ ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలని విపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను కార్పొరేట్ సంస్థలకు విక్రయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హుడా ట్రక్ పార్క్ స్థలాన్ని యథావిధిగా ట్రక్ పార్కింగ్ కోసం కొనసాగించాలని, లేదంటే స్థానికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించాలని కోరారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ట్రక్ పార్క్ బాధితులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, వివిధ పార్టీల కార్యకర్తలు అక్కడి నుంచి ర్యాలీగా హెచ్ఎండీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్(MLC Shambipur Raju) రాజుతో పాటు బీఆర్ఎస్, వామపక్ష నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ముట్టడి నేపథ్యంలో హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం వైపు వస్తున్న విపక్ష నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 27న నిర్వహించనున్న ఈ-వేలాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన భూములను కాపాడాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.