డిసెంబర్ 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly Winter Sessions) డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. సుమారు 15 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్'(Investment Protection Act) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులకు దీర్ఘకాలిక భరోసా కల్పించడమే ఈ ప్రతిపాదిత చట్టం లక్ష్యం.
ప్రభుత్వాలు మారినా గతంలో పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, భూ కేటాయింపులు, రాయితీలు, అనుమతుల్లో మార్పులు చేయకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ చట్టం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచి మరిన్ని పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.
ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు(CII Partnership Summit)లో 303 ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల రక్షణ చట్టంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ఈ బిల్లును తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ సైతం స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి, పెండింగ్ పనులు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగానే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక, సాగునీటి రంగాలకు కూడా కీలకం కానున్నాయి.