పౌల్ట్రీ రంగానికి అండగా ఉంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి(Poultry industry development)కి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భరోసా ఇచ్చారు. కోళ్ల దాణా కొరత సమస్యపై 48 గంటల్లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే పౌల్ట్రీ రంగంలో దేశంలోనే అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించామని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 5.3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేస్తూ పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. పౌల్ట్రీ సంస్థలకు అనుమతుల జారీలో జాప్యం, కోళ్ల దాణా కొరత వంటి సమస్యలు పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీఎం దృష్టికి వచ్చింది. పౌల్ట్రీ ఫామ్ల నిర్మాణానికి వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచిస్తామని చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్(Future City Convention Centre) ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పిస్తే పరిశీలించి, భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేయడంలో పౌల్ట్రీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమ సంక్షోభంలో పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.