కోలీవుడ్‌పై శ్రీలీల ఫోకస్

03-11-2026 | 04:11pm

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలకు కోలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'డేర్ డెవిల్‌'లో ఆమె కథానాయికగా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా చెన్నైలో నిర్వహించిన సినిమా ప్రారంభ వేడుకకు శ్రీలీల హాజరుకావడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమనే వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ సినిమా హీరోయిన్ విషయంలో గతంలో పలు ఊహాగానాలు వినిపించాయి. తొలుత శ్రీలీల స్థానంలో కయాదు లోహర్‌ను తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా ప్రారంభ వేడుకలో శ్రీలీల పాల్గొనడంతో ఈ చర్చకు తెరపడినట్లయింది. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'డేర్ డెవిల్' అజిత్ కెరీర్‌లో 64వ చిత్రంగా తెరకెక్కుతోంది. గతంలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో అజిత్‌కు దర్శకత్వం వహించిన ఆధిక్ రవిచంద్రన్ మరోసారి ఆయనతో జతకట్టారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ భార్య షాలిని తన బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు ఇదే తొలి ప్రాజెక్ట్ కావడం మరో విశేషం.

శ్రీలీలకు కోలీవుడ్‌లో కొత్త ఆశలు!

తెలుగులో వరుస సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో శ్రీలీలకు కొత్త అవకాశాల విషయంలో కొంత విరామం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఆమె కెరీర్‌కు కీలకంగా మారవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. కాగా, సినిమా ప్రారంభ వేడుకకు అజిత్ హాజరుకాలేదు.

మరిన్ని వార్తలు