నిర్ణీత గడువులోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(State Chief Election Officer Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, మ్యాపింగ్ కాని, అసాధారణ వివరాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 94 శాతం విచారణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఫారం 6, 7, 8 కింద మొత్తం 5,220 దరఖాస్తులు అందాయని, నిబంధనల ప్రకారం వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.