ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి అక్రమ రవాణా
ముగ్గురు నిందితుల అరెస్ట్
కేసముద్రం, (విజయక్రాంతి): ఒడిశా(Odisha) నుంచి హైదరాబాద్(Hyderabad) కు అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల విలువైన 10.165 కిలోల ఎండు గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీసులు(Kesamudram Police, Mahabubabad District) అరెస్టు చేశారు. శనివారం ఉదయం సుమారు 10:50 గంటలకు కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, జ్యోతిరావు ఫూలే సెంటర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.
వారి వద్ద ఉన్న రెండు బ్యాగులు, ఒక చేతి సంచిలో బ్రౌన్ రంగు టేపుతో ప్యాక్ చేసిన 10.165 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి హైదరాబాద్లో విక్రయించడం ద్వారా లాభాలు పొందాలని ప్రణాళిక వేసుకున్నట్లు గూడూరు సిఐ వినయ్ కుమార్, కేసముద్రం ఎస్ ఐ క్రాంతి కిరణ్ వెల్లడించారు. ఈ సంఘటనలో హరిజనవాడ, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్ కు చెందిన కుమ్మరి నితిన్, ఉప్పరపల్లి గ్రామం, షామీర్పేట మండలం, మేడ్చల్ జిల్లాకు చెందిన తాండ్ర బాలకృష్ణ, ఉప్పరపల్లి గ్రామం, షామీర్పేట మండలం, మేడ్చల్ జిల్లాకు చెందిన బీజాల అవినాష్ అరెస్టు చేశారు.
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.